CM Chandrababu: అన్నదాతలకు ఏరువాక శుభాకాంక్షలు.. అమరావతి నిర్మాణం, ప్రజా సేవల్లో వేగం పెంచాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమమిదని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేదే ఏరువాక పున్నమి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజా ఫిర్యాదులు సులభంగా స్వీకరించాలి
రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖల్లో సేవలు పొందడం సులభతరం చేయాలన్నారు.
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని, ‘మనమిత్ర’ వాట్సప్‌లోనూ ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. వాయిస్ మెసేజ్‌లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు పరిష్కరించాలని, సుమారు 3వేల ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ సమస్యను మూడు నెలల్లో తీర్చాలని నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు.
అమరావతి నిర్మాణ పనులు వేగవంతం
అమరావతి రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశం గర్వించేలా అమరావతిని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం 50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు తెలిపారు. హౌసింగ్, ట్రంక్ ఇన్‌ఫ్రా, ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140 భారీ యంత్రాలు పనుల్లో నిమగ్నమై ఉన్నాయని మంత్రి నారాయణ వివరించారు.
పనులు వేగంగా చేసేందుకు మానవ వనరులు, యంత్రాలు, సామగ్రి ముందుగా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్‌ను కాంట్రాక్టర్లు సంపాదించేలా చేయాలన్నారు. కొందరు లిటిగెంట్లుగా మారి పనులను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై సీఎం పలు సూచనలు చేశారు. పనులు పూర్తయ్యాక రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. నాణ్యతపై ఎక్కడా రాజీ లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ, మెగా ఇంజినీరింగ్, ఎన్‌సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ వంటి సంస్థల ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం రైతులు, ప్రజలు, అభివృద్ధి అన్నీ ఒకేసారి సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

