CM Chandrababu, Home Minister Anita: గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన దారుణ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలకు తావులేదని అన్నారు.

ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారని తెలిపారు. ఘటనలో ప్రమేయం ఉన్న సదరు పార్టీ కార్యకర్తను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ అండదండలు ఉన్నా చట్టం వదిలిపెట్టదని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టం ఎవరికీ లొంగదు, పక్షపాతం చూపదని, రాజకీయ పలుకుబడి ఉన్నా ఎవరికీ రక్షణ లభించదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే, ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ నిర్లక్ష్యం వహించాడని హోం మంత్రి ప్రశ్నించారు. విచారణలో నిర్లక్ష్యం చూపిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆడబిడ్డల జోలికి వచ్చేవారిని ఎంతటి వారైనా ఉపేక్షించరాదని, నేరస్థుల్ని నేరస్థులుగానే చూడాలని, పార్టీల పరంగా చూడరాదని స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటన సమాజంలో తీవ్ర కలకలం సృష్టించింది. మహిళల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story