CM Chandrababu: ధవళేశ్వరం బ్యారేజీ పునరుద్దరణకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అమర్చింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లను కొత్తవాటితో భర్తీ చేసే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం
వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సమయానికి బ్యారేజీని సిద్ధం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
సభలో చంద్రబాబు స్పష్టం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన చంద్రబాబు, “2014లో రూ.32 కోట్లతో 64 గేట్ల మరమ్మతులు చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లను మార్చడం కాదు కదా.. కొట్టుకుపోయినా పట్టించుకోలేదు” అని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును ఏపీ జీవనాడిగా భావించి 72 శాతం పనులు పూర్తి చేశామని, తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021లోనే పూర్తి అయ్యేదని గుర్తు చేశారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తీసుకెళ్లామని, గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ముంబయి వెళ్లి పవన్‌ను పరామర్శించినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాకే విధుల్లోకి రావాలని సూచించినట్లు చెప్పారు.
ఈ పునరుద్దరణ పనులతో ధవళేశ్వరం బ్యారేజీ మరింత బలం పొంది, గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

