CM Chandrababu Launches Scathing Attack on Jagan: సీఎం చంద్రబాబు జగన్‌పై ఘాటు విమర్శలు: ‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’
‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’

CM Chandrababu Launches Scathing Attack on Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం సభలో ప్రసంగించిన ఆయన, జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నారా? బెంగళూరులో కూర్చుంటే అక్కడే రాజధాని.. ఇడుపులపాయ వెళ్తే అక్కడే రాజధానా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఇలా మాట్లాడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మొన్నటివరకు మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాట ఆడారని, ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పినా వినకపోవడంతో ప్రజలే బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. రాజ్యాంగంలో రాజధాని పేరు ఎక్కడా లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని జగన్ అంటుంటే అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. నది పక్కన వచ్చిందంటూ రాజమహేంద్రవరం, దిల్లీ, లండన్ వంటివి ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కనీస ఇంగితజ్ఞానం లేనివాళ్లు రాజకీయాలు చేస్తే ఏం మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) అంటే ఆయనకు అర్థం కావట్లేదని, మెడికల్ కళాశాలలు ఆ విధానంలో నిర్మిస్తామంటే వద్దని బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తే అప్పుడు విధ్వంసం చేసి, ఇప్పుడు ఆ క్రెడిట్ తనదని అంటున్నారని విమర్శించారు. పీపీపీలో మెడికల్ కళాశాలలు వద్దు.. కానీ పీపీపీలోనే నిర్మించిన భోగాపురం విమానాశ్రయం మాత్రం ముద్దా? అని ప్రశ్నించారు.
తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకోవడం తమ విధానం కాదని స్పష్టం చేసిన చంద్రబాబు, ఇప్పుడు పెద్దవీరుడు బయలుదేరాడని, నీళ్లు కావాలా.. గొడవలు కావాలా? అంటే గొడవలే కావాలనుకునే రకం జగనని వ్యాఖ్యానించారు. తనకు తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని, నదులను అనుసంధానం చేసుకుంటే ఏపీని మించిన రాష్ట్రం ఉండదని చెప్పారు. అవసరమైతే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
గత ప్రభుత్వంలో తిరుమలలో నెయ్యిని కల్తీ చేశారని, దర్శనాలను అక్రమాలమయం చేశారని ఆరోపించారు. తాము తిరుమలను పవిత్రంగా నిర్వహిస్తున్నామని, ఇది భరించలేక ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్లి సాక్షి టీవీ, పత్రికలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. హాలోగ్రామ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే దొంగలు పట్టుబడ్డారని చెప్పారు. డాక్టర్ సుధాకర్‌ను చిత్రహింసలు పెట్టి రోడ్డుపై నిలబెట్టి పిచ్చోడని ముద్రవేసి చనిపోయేలా చేశారని ఆరోపించారు. తాము ఆయన కుమారుడికి పదోన్నతి ఇచ్చి, కుటుంబానికి రూ.కోటి సాయం చేసి ఆదుకున్నామని తెలిపారు.
గత గోదావరి పుష్కరాల్లో అఖండ హారతి ప్రారంభించానని, వచ్చే ఏడాది మూడోసారి పుష్కరాలు నిర్వహించే అదృష్టం తనకు దక్కిందని సీఎం వెల్లడించారు. మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, గత ఎన్నికల్లో ఓడిపోకపోతే 2021లోనే పూర్తయ్యేదని అన్నారు.
ఈ విధంగా చంద్రబాబు జగన్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలతో నిప్పులు చెరిగారు.

