అధికారులకు కీలక సూచనలు

CM Chandrababu Monitors AP Rain Situation from Dubai: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం, రాష్ట్రంలోని వర్ష పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. దుబాయ్ నుంచే అధికారులతో సమీక్ష నిర్వహించి, వర్షాల ప్రభావిత జిల్లాల గురించి వివరాలు తెలుసుకున్నారు.

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాల పరిస్థితిని మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఆర్టీజీ అధికారులతో చర్చించారు. అప్రమత్తంగా ఉండి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీసు, సేద్యం, మున్సిపల్, రోడ్లు-భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత స్థలాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు.

కాలువలు, చెరువుల గట్లు బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టం చేయాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు.

Updated On 23 Oct 2025 5:31 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story