CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ ప్రతిష్ఠాత్మక అవార్డు
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ ప్రతిష్ఠాత్మక అవార్డు

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు రాష్ట్రంలో వ్యాపార సంస్కరణలను ధైర్యంగా అమలు చేసినందుకు, పెట్టుబడులను ఆకర్షించడంలో చూపిన నాయకత్వాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది.
ఈ పురస్కారం గురించి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘తండ్రిగారు చంద్రబాబు నాయుడికి ఈ అవార్డు లభించడం రాష్ట్రానికే కాకుండా మా కుటుంబానికి కూడా ఎంతో గర్వకారణం. సంస్కరణలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు’’ అని లోకేష్ తెలిపారు.
గతంలో ఈ అవార్డు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎస్. జయశంకర్, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులకు లభించిన నేపథ్యంలో చంద్రబాబుకు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం, పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడంలో చంద్రబాబు నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ అభిప్రాయపడింది.
ఈ అవార్డు ప్రకటనతో రాష్ట్ర మంత్రులు, అధికారులు, కలెక్టర్లు చంద్రబాబును అభినందించారు. ఈ పురస్కారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

