మంత్రులు, అధికారుల బృందంతో కలిసి ఐదు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి సింగపూర్‌ బాట పడుతున్నారు. పలు రంగాల అధ్యయనానికి ఆయన సారధ్యంలో మంత్రులు, అధికారులతో కూడిన బృందం ఈ నెలలో సింగపూర్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ఈ బృందం సింగపూర్లో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్‌, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఎకనామిక్‌ డెవలప్మెంట్‌ బోర్డు సీఈఓ సాయికాంత్‌ వర్మ, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి కన్నబాబులు సింగపూర్‌ పర్యటించే బృందంలో ఉన్నారు. చంద్రబాబు బృందం సింగపూర్‌ లో పలు రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశమవుతారు. ప్రధానంగా ఈ పర్యటనలో నగర నిర్మాణ ప్రణాళిక, ఉద్యానవనాల ఏర్పాటు, నగర సుందరీకరణ, ఓడరేవుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఅభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించడంపై చంద్రబాబు బృందం ఈ పర్యటనలో అధ్యయనం చేస్తుంది. ఆయా రంగాల ప్రముఖలుతో చంద్రబాబు టీమ్‌ సమావేశాలు జరిపి చర్చలు జరుపుతుంది. సీయం చంద్రబాబుతో పాటు, మంత్రులు, అధికారులు సింగపూర్‌ పర్యటనకు సంబంధించి పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Updated On 14 July 2025 11:28 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story