ఆఫీసులకు రాకుండానే!

CM Chandrababu Orders: ప్రభుత్వ సేవలన్నీ శతశాతం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. "ఆన్‌లైన్, వాట్సప్, మొబైల్ యాప్‌ల ద్వారానే ప్రజలకు సేవలు అందాలి. ఇకపై ఎవరూ కార్యాలయాలకు రమ్మని పిలవొద్దు. అలాంటి పరిస్థితి ఏ శాఖలోనూ ఉండకూడదు" అని స్పష్టం చేశారు. డేటా ఆధారిత పాలనపై గురువారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సదస్సులో ఆయన ఈ మేరకు నిర్దేశించారు.

సదస్సులో మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, జీఏడీ మంత్రి కొల్లు సత్యప్రసాద్, ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నియోజకవర్గ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.

డిజిలాకర్ తరహా వ్యవస్థ రాష్ట్రంలోనూ!

కేంద్రం డిజిలాకర్ తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేడီ ఆలోచనలో ఉన్నట్లు సీఎం వెల్లడించారు. "ఆధార్‌తో లింక్ చేసి ప్రజలు తమ అన్ని పత్రాలూ ఒకేచోట చూసుకునేలా చేస్తాం. కుటుంబ యూనిట్‌గా జియో ట్యాగింగ్ పూర్తయింది. ఈ డేటాను అన్ని శాఖలూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. డేటా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది – దాన్ని సద్వినియోగం చేసుకోండి" అని ఆదేశించారు.

శుక్రవారం నుంచే అమలు.. భేషజాలు వద్దు!

"డేటా ఆధారిత పాలనకు మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పూర్తి బాధ్యత తీసుకోవాలి. శుక్రవారం (నవంబరు 7) నుంచే ఇది అమలులోకి వస్తుంది. సందేహాలుంటే ఆర్‌టీజీఎస్‌లో అడిగి తెలుసుకోండి. కానీ ఆర్‌టీజీఎస్ అమలు ఏజెన్సీ కాదు – డేటా సేకరణ, నిర్వహణ మాత్రమే చేస్తుంది. ఫలితాలు చూపించాల్సింది మీరే!" అని చంద్రబాబు హెచ్చరించారు.

డిసెంబరు రెండో వారంలో కలెక్టర్ల స్పెషల్ కాన్ఫరెన్స్‌లో మరోసారి ఈ అంశంపై సమీక్ష ఉంటుందని, అప్పటికి అందరూ తమ సామర్థ్యం నిరూపించుకోవాలని సూచించారు. "సాంకేతికత తెలియదా? నేర్చుకోండి! కార్యాలయాల్లో కూర్చుని ఉండొద్దు – క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించండి. భేషజాలు ఆపండి" అని కొరడా ఝళిపించారు.

డేటానే సంపదగా మార్చండి

"డేటా అంటే సంపద. సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధ్యం. వసతి గృహాల్లో డయేరియా వచ్చినా మంత్రులు, అధికారులు రియల్ టైమ్‌లో ఎందుకు గమనించలేదు?" అని ప్రశ్నించారు. డేటాలేక్, డేటా లెన్స్‌లను అన్ని శాఖలూ అనుసంధానం చేసుకోవాలని, ఏఐ ఆధారిత యూజ్ కేసులు తయారు చేయాలని ఆదేశించారు.

13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్‌టీజీ కార్యాలయాల నిర్మాణం డిసెంబరు 15లోగా పూర్తవుతుందని, అవి 26 జిల్లాలకు సేవలందిస్తాయని తెలిపారు.

ఒక్కరి తప్పిదమే ప్రభుత్వానికి చెడ్డపేరు

"ఒక్కరు తప్పు చేసినా మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తోంది. ఎక్సైజ్ శాఖలో గత అయిదేళ్లుగా ఎన్నో అక్రమాలు జరిగాయి. మనం అధికారంలోకి వచ్చాక పారదర్శకత తెచ్చాం. అయినా కొందరు కుట్రలు పన్నుతున్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు – అలా చేస్తున్నామని ప్రజలకు చాటి, వారిలో నమ్మకం కల్పించాలి" అని చంద్రబాబు నొక్కి చెప్పారు.

డేటాసెంటర్లు, ఎనలిటిక్స్ ద్వారా కార్పొరేట్ కార్యాలయాల ప్రాధాన్యం తగ్గుతోందని, ట్రెండ్స్ మారుతున్నాయని, విజన్‌తో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమని సీఎం పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story