CM Chandrababu Reviews Konaseema Blowout Incident: కోనసీమ బ్లోఅవుట్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజల భద్రతకు ప్రాధాన్యత
ప్రజల భద్రతకు ప్రాధాన్యత

CM Chandrababu Reviews Konaseema Blowout Incident: డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ప్రాంతంలో ఓఎన్జీసీ సైట్‌లో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనా స్థలంలో పరిస్థితులు, గ్యాస్ లీకేజీ నియంత్రణ చర్యలు, ప్రజల రక్షణకు చేపడుతున్న కార్యక్రమాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వివరంగా నివేదిక ఇచ్చారు.
ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతారని గుర్తుచేసిన చంద్రబాబు.. వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసి, వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఇళ్లు, గ్రామాలు విడిచిపెట్టిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం చూడాలని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదం వల్ల కాలిపోయిన కొబ్బరి తోటల యజమానులకు తగిన పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలని సీఎం సూచించారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓఎన్జీసీతో పాటు సంబంధిత సంస్థలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఘటనలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని, అన్ని చర్యలూ దానికి అనుగుణంగానే ఉంటాయని అధికారులు తెలిపారు.

