CM Chandrababu: ఎల్‌నినో సవాళ్లు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కేబినెట్లో కీలక నిర్ణయాలు
కేబినెట్లో కీలక నిర్ణయాలు

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం, తాగునీటి సమస్యలు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై సీఎం సీరియస్‌గా స్పందించారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదని సీఎం స్పష్టం చేశారు. వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రకటనల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో లేకపోవడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వెలిగొండ ప్రారంభానికి జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పనిచేశాయని, రామానాయుడు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ మంచి పని చేశారని అభినందించారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కానుందని, ఆంధ్ర పాప్‌కార్న్, అరకు కాఫీ ప్రతి గ్రామానికి విస్తృతంగా చేరాలని సూచించారు.
ఎల్‌నినో పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం, రాష్ట్రంలో మైనస్ 52 శాతం వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 76 శాతం, ప్రకాశంలో 70 శాతం లోటు ఉందని, గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని చెప్పారు. తాగునీరు అందించడం, పశుగ్రాసం లోటు లేకుండా చూడటం, సీడ్ బాల్స్‌పై ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. తాగునీటికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమని, అవకాశం ఉన్న చోట నీటి స్టోరేజ్ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రౌండ్ వాటర్‌ను అంచనా వేసి అవసరమైతే అదనంగా బోర్లు వేయడానికి అనుమతి ఇస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూడాలని, తాగునీటిని రవాణా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్‌డీపీ తగ్గకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని సమీక్షిద్దామని పేర్కొన్నారు. ఈరోజే కేంద్రానికి లేఖ రాసి, ప్రతినెలా క్షేత్రస్థాయి పరిస్థితులు నివేదిస్తామని తెలిపారు. కరవు నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టే విధానంపై కూడా చర్చ జరిగింది.
వెలిగొండ, పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం, మంత్రి రామానాయుడు, ఇంజినీరింగ్ అధికారులను ప్రశంసించారు. కేబినెట్‌లోకి సీఎం ప్రవేశించగానే మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. మంత్రులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పుకోవాలని సూచించారు. “కొత్త తరం జెన్‌జీ అన్ని విషయాలపై అవగాహనతో ఉంది. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు. మనం కూడా అందుకు తగినట్టుగా సిద్ధమవ్వాలి. మనం చేస్తున్న మంచిని జెన్‌జీ వద్దకు తీసుకెళ్లాలి” అని సీఎం అన్నారు.
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులను కోరారు. తప్పుడు, ఫేక్ ప్రచారాల్లో వైసీపీ ముందుందని విమర్శించారు. వెలిగొండ, పోలవరం నీటి విడుదలపై కూడా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పూర్తైనా అది కూటమి ప్రభుత్వం చేసిందేనని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, కేబినెట్ సబ్‌కమిటీ ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ధరల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

