CM Chandrababu Urges: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరిన సీఎం చంద్రబాబు
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Urges: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమావేశం అయ్యారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2027 గోదావరి పుష్కరాలలోపు పూర్తి చేయడానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టులోని కీలక అంశాలను పరిష్కరించాలని కోరిన సీఎం, తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే తాను స్వయంగా ఐదుసార్లు ప్రాజెక్టు సైటును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్లు వివరించారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్-1, గ్యాప్-2లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉండటంతో 2011లో వచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. దీంతో ప్రాజెక్టు పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా కొనసాగించవచ్చని సీఎం స్పష్టం చేశారు.
నిధులు, కాలువల సామర్థ్యం పెంపు
సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు చంద్రబాబు తెలిపారు. కాలువల సామర్థ్యం పెంచినంత మేరకు అదనపు నిధులను రీయింబర్స్ చేయాలని, ప్రాజెక్టు తదుపరి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
ప్రధాని కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ నీటి పథకాల పునరుద్ధరణ, ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతు, కాలువల పూడికతీత, గట్ల బలోపేతం వంటి పనులు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు.
ఇతర కీలక అభ్యర్థనలు
సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేవరకు ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్-3 కింద కర్ణాటక భూసేకరణ పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలి.
రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల దాహార్తి తీర్చే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలి.
వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, ఏపీ అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడివైపు హెడ్ స్లూయిస్ నిర్మాణం వంటి పనులకు సహకరించాలి.
ఈ అంశాలన్నింటినీ వివరిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు సీఎం చంద్రబాబు లేఖ కూడా అందజేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు ఆశాకిరణమని సీఎం పేర్కొన్నారు.

