ExMla Malladi Vishnu : వినాయకుడి సాక్షిగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు
సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

- దైవ దర్శనాని కంటూ వచ్చి రాజకీయాలు మాట్లాడతారా?
- భగవంతుడిపై భక్తీ, విశ్వాసాలు ఉన్న వారేవరైనా ఇలా చేస్తారా?
- చంద్రబాబు నీచ రాజకీయ మనస్తత్వం మరోసారి బయటపడింది
- హిందూధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
- 2018 లో మీ హయాంలోనే డూండీ సంస్థ గణేష్ ఉత్సవాలు నిలిపివేసింది
- అనుమతులు ఇవ్వలేదని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిందలు ఎలా మోపుతున్నారు?
- హిందూధర్మ పరిరక్షణకు సీఎంగా వైయస్ జగన్ విశేష కృషి
- ఆలయాలను కూల్చి మహాపాపానికి ఒడిగట్టిన చంద్రబాబు
పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామి వారి దర్శనం అంటూ వెళ్ళి, దైవం సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండగపూట దేవుడి సమక్షంలో సీఎంగా చంద్రబాబు పచ్చి అబద్దాలు, అభాండాలతో తన నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూధర్మాన్ని పాటించే వారెవరైనా భగవంతుడి సమక్షంలో ఆధ్యాత్మిక అంశాలు తప్ప, రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస ఇంగితాన్ని పాటిస్తారని, చంద్రబాబుకు మాత్రం ఇవేమీ పట్టవని ధ్వజమెత్తారు. పాపాలు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు దేవుడంటే కూడా భయం లేదని, అందుకే వినాయకచవితి పందిరిలోనే పవిత్రతను పక్కకుపెట్టి పరనిందకు తెగబడ్డారని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో హిందూధర్మాన్ని కాలరాసిన చరిత్ర చంద్రబాబుది అయితే, ఆ ధర్మాన్ని నిలబట్టేందుకు భక్తితో కృషి చేసిన ఘనత వైయస్ జగన్‌దేనని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...
సీఎం చంద్రబాబు పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవడం అలవాటు. తన రాజకీయ అవసరాల కోసం కొన్నిసార్లు హిందూవాదీగా, మరికొన్ని సందర్భాల్లో లౌకికవాదిగా నటించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత చంద్రబాబు మార్చిన రంగులు ఎన్నో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైయస్ఆర్‌సీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడూ తన విధానాన్ని రాజకీయాల కోసం మార్చుకోలేదు. ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికశోభ పరిఢవిల్లాలని, మానవత్వం పరిమళించాలని గట్టిగా నమ్మే పార్టీ వైయస్ఆర్‌సీపీ. వైయస్ జగన్ గారు కూడా ఇదే సిద్దాంతాన్ని బలంగా నమ్ముతారు. వినాయకచవితి నాడు ఉదయం తాడేపల్లిలో గణేష్ ఉత్పవంలో, పూజా కార్యక్రమంలో మాజీ సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ విషయం తెలియగానే సాయంత్రానికి షెడ్యూల్‌లో లేకపోయినా కూడా సీఎం చంద్రబాబు భవానీపురంలోని వినాయకపందిరిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన రాజకీయ విమర్శలను, వైయస్ జగన్ గారిన ఉద్దేశించిన మోపిన నిందలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలు ముందుగానే ఖరారవుతాయి. అత్యవసరం అయితే తప్ప షెడ్యూల్ లేని కార్యక్రమాలకు సీఎం హాజరుకారు. అలాంటిది వినాయకచవితి పర్వదినం గురించి ముందుగానే అందరికీ తెలుసు. సీఎం హోదాలో చంద్రబాబు హాజరవుతారంటే, దానికి గానూ ముందుగానే షెడ్యూల్ కూడా ఖరారు చేసి, ప్రకటిస్తారు. ఇటువంటివి ఏమీ లేకుండానే సాయంత్రం హడావుడిగా చంద్రబాబు వినాయక మంటపానికి వెళ్ళారంటేనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఉదయం నుంచి వినాయక మంటపానికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా, హఠాత్తుగా వెళ్ళిన చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడారో చూస్తే, ఆయన ఉద్దేశం ఏమిటో పూర్తిగా అవగతం అవుతుంది. దేవుడి సమక్షంలో కూడా చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్దాలు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో, ఎటువంటి విషం చిమ్మారో, రాజకీయ ప్రసంగాలతో ఆద్యాత్మిక వాతావరణాన్ని ఎలా కలుషితం చేశారో ప్రజలంతా చూశారు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటానికి పండగ పూట ఆయనకు నోరెలా వచ్చింది? విష్నేశ్వరుడిని భక్తితో కొలిచేందుకు అక్కడికి వెళ్ళారా? లేక రాజకీయ ప్రసంగాలు, విమర్శలు, దూషణలతో చివరికి పండగను కూడా తన కుటిల రాజనీతికి వాడుకునేందుకు వెళ్ళారా?
ఎన్ని వినాయక మంటపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు..?
గత అయిదేళ్ళ పాటు వైయస్ఆర్‌సీపీ పాలనలో వినాయక చవితి వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు పూర్తి సహాయ సహకారాలను అందించింది. ఇందుకోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేసింది. వివిధ శాఖలకు చెందిన వారి నుంచి అనుమతులు తీసుకోవడం ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బంది అవుతుందని గమనించి, ఒకే దగ్గర అన్ని అనుమతులను తీసుకునేందుకు వీలు కల్పించింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మా విధానాన్నే అమలు చేస్తూ, గత వైయస్ఆర్‌సీపీపై మాత్రం విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత పదిహేను నెలల కాలంగా ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేశారు. విద్యుత్ చార్జీలు పెంచారు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నాయి, ప్రజలను ఆదుకునే చర్యలు పూర్తిగా మరిచిపోయారు, అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. పండుగ పూట కూడా తాము అనుభవిస్తున్న కష్టాలను ఆ దేవుడికి విన్నవించడంతో పాటు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కూడా బలంగా కోరుకున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిపోవాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలని వేడుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రూ.19వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. మరోవైపు వినాయకచవితి పందిళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్ని పందిళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చారో చెప్పై దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ప్రతి గణపతి మంటపం నుంచి కనీసం రూ.1000 చొప్పున కట్టించుకుంటున్నారు. ఇది భరించలేక చాలా వినాయక మంటపాల్లో తమ ఇళ్ళ నుంచి కరెంట్‌ను స్వచ్ఛందంగా ఇచ్చారు.
వ్యాపారుల నుంచి ఎంతెంత వసూలు చేశారు..?
నిన్న వినాయక మంటపంలో చంద్రబాబు మాట్లాడుతూ డూండీ గణేష్ సంస్థ గురించి మాట్లాడారు. 2015, 2016 లో ఇదే సంస్థ ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో గణేష్ వేడుకలను నిర్వహించింది. 2017 లో జింఖానా గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను నిర్వహించింది. ఆ తరువాత 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ ఉత్సవాలను నిర్వహించింది. గత అయిదేళ్ళపాటు డూండీ గణేష్ నిర్వాహకులను ఉత్పవాలు నిర్వహించకుండా, అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, ఆ ఏడాది ఎందుకు డూండీ గణేష్ సంస్థ ఉత్సవాలను నిర్వహించలేదో చంద్రబాబు చెప్పాలి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో 800 వినాయక మంటపాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎంతో ఘనంగా ఏరియాల వారీగా ఉత్సవాలు జరిగాయి. చంద్రబాబు దర్శించుకున్న వినాయక మంటపాన్ని ఏర్పాటు చేసిన సంస్థ వ్యాపారుల నుంచి ఎంత మేర డబ్బులు వసూలు చేసిందో ముందు తెలుసుకుని మాట్లాడాలి.
హిందూధర్మం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో 40కి పైగా దేవాలయాలను నిర్ధాక్షణ్యంగా కూల్చివేసిన ఘనుడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు దేవుడి గురించి, ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఆయన కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మించింది సీఎంగా వైయస్ జగన్. తిరుమలలో వెయ్యి కాళ్ళ మంటపాన్ని కూల్చిన ఘనత కూడా చంద్రబాబుదే. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ప్రసిద్ద కాణిపాకం గణపతి ఆలయాన్ని అన్ని హంగులతో పునర్ నిర్మించిన చరిత్ర సీఎంగా వైయస్ జగన్‌ది. తన పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. కాణిపాక వినాయకుడికి సంబంధించి బంగారురథం వైయస్ జగన్ గారి హయాంలోనే సిద్దం చేయించి, స్వామివారికి సమర్పించారు. తిరుపతిలో వకుళమాత ఆలయాన్ని వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పునర్ నిర్మించారు. విజయవాడలోని దుర్గగుడిలో రూ.75 కోట్లు దసరా ఉత్సవాల కోసం ప్రభుత్వం నిధులను సమకూర్చి, ఘనంగా నిర్వహింపచేశారు. దేవాలయ వ్యవస్థ, హిందూధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తి చేసింది కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే. ప్రకాశం బ్యారేజీ పక్కన చిన్నజీయర్ స్వామివారి మఠానికి కొండను ఇవ్వడం వల్ల విజయకీలాద్రిగా వర్థిల్లుతోంది. గణపతి సచ్చితానంద స్వామీజీకి చెందిన అనంతపురం భూవివాదంను కూడా పరిష్కరించడం వల్ల నేడు అక్కడ చక్కని ఆసుపత్రి నిర్మాణం జరిగి, పెద్ద ఎత్తున ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. స్వరూపానంద స్వామీజీకి హిందూధర్మ పరిరక్షణ కోసం విశాఖపట్నంలో భూమి కేటాయిస్తే, దానిని లాక్కుని, ఆయనపై కక్షతో విష ప్రచారం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే విశాఖపట్నంలో ఊరుపేరు లేని అనేక డొల్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టిన ఘనత చంద్రబాబుదని మల్లాది విష్ణు తీవ్రంగా విమర్శించారు.
