Rajamahendravaram Medico Incident: రాజమహేంద్రవరం మెడికోల ఘటనపై సీఎం ఆగ్రహం.. నిందితులను ఉపేక్షించొద్దని అధికారులకు ఆదేశం
అధికారులకు ఆదేశం

Rajamahendravaram Medico Incident: రాజమహేంద్రవరంలో ఇద్దరు వైద్య విద్యార్థులను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పరారైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఉపేక్షించవద్దని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
ఈ ఘటనలో బాధితులైన మెడికల్ విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును నిర్లక్ష్యంగా నడుపుతూ.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రియాంక, ఉమేష్‌ను ఢీకొట్టి పరారయ్యారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ గేటు వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియాంక తలకు తీవ్ర గాయం కావడంతో ముందుగా స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నారు. విజయవాడకు చెందిన ఉమేష్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
అధికారులు సీఎంకు వివరాలు తెలిపుతూ.. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పరారైన నిందితులను అరెస్ట్ చేశామని సమాచారం ఇచ్చారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని, బాధితులకు అత్యుత్తమ వైద్య సాయం అందించాలని చంద్రబాబు సూచించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

