CM Nara Chandrababu Naidu: గొడ్డలి పార్టీ అసెంబ్లీ బహిష్కరణపై సీఎం తీవ్ర విమర్శ
సీఎం తీవ్ర విమర్శ

CM Nara Chandrababu Naidu: దేవాలయం లాంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ తాజా పరిణామాలపై ఆయన స్పందించారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని, బయట కూర్చొని ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని ఆయన తెలిపారు. 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి ఇద్దరే సభలో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. 1989-94లో ఎన్టీఆర్ కొన్ని రోజులు సభకు రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడామని వివరించారు.
2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే ‘గొడ్డలి పార్టీ’ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చొని డీఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.గొడ్డలి ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. అతని మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.

