CM Revanth: రాష్ట్రంలో రాబోయే ఎనిమిది నెలల పాటు కొనసాగనున్న ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ప్రతి నెలా రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి కరువును నివారించడమే ప్రధాన లక్ష్యమని, తిండిగింజల కొరత లేదని స్పష్టం చేశారు.

క్లైమేట్ కాన్‌క్లేవ్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎల్‌నినో కోవిడ్ లాంటి సంక్షోభమేనని హెచ్చరించారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలని, ఒక సీజన్ వరి పంటను త్యాగం చేస్తే పశుసంపదను, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఎల్‌నినో ప్రభావం మొదలయ్యే నాటికే బియ్యం నిల్వలను సిద్ధం చేశామని, రెండేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు.

రాబోయే ఎనిమిది నెలలు నీటిని పొదుపుగా వాడాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులతోపాటు పర్యావరణానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న క్లైమేట్ కాన్‌క్లేవ్ సన్నాహక సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కతోపాటు ఆధ్యాత్మికవేత్త పండిట్ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్ పాల్గొన్నారు.

పెట్టుబడులు, పర్యావరణం మధ్య సమతుల్యత పాటించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదని, తెలంగాణకు చెరువుల చరిత్ర ఉందని చెప్పారు. 800 ఏళ్ల క్రితమే పూర్వీకులు కుంటలు, చెరువులపై దృష్టి పెట్టారని, రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి వరంగల్‌లో అనేక చెరువులను తవ్వించారని గుర్తు చేశారు.

కాలక్రమేణా కనుమరుగైన చెరువులను పరిరక్షించడానికే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. కబ్జాదారులు, కోర్టు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, బతుకమ్మ కుంట, తమ్మిడికుంట చెరువులను పునరుద్ధరించామని చెప్పారు. మూసీ నదిని ప్రపంచంలోనే అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా మారిన నేపథ్యంలో ప్రక్షాళన చేసి పరిరక్షించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

పండిట్ రవిశంకర్, రాజేంద్రసింగ్ లాంటి వారి సలహాలతో ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని తెలిపారు. పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, భవిష్యత్తులో సుందరమైన మూసీని తీర్చిదిద్దుతామని చెప్పారు. నీటి పంటలు, చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, వాగుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పోలం బాట కింద పొలాల అనుసంధానం వంటి పనులపై దృష్టి పెడతామని వివరించారు.

రైతులు, గ్రామీణ ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వాతావరణ స్థితిస్థాపకతను అభివృద్ధి వ్యూహంలో భాగం చేస్తామని, క్లైమేట్ కాన్‌క్లేవ్‌లో పెట్టుబడిదారులు, నిపుణుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. ఎల్‌నినోను కలిసి ఎదుర్కొంటేనే తాగునీరు, వ్యవసాయాన్ని కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Next Story