ఓ టీవీ చానెల్‌ డిబేట్‌లో వీవీఆర్ కృష్ణంరాజు అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు భావిస్తూ, మంగళగిరి కోర్టు ఆయనకు జూన్ 26వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 6వ తేదీన ప్రసారమైన డిబేట్‌లో పాల్గొన్న కృష్ణంరాజు, అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక వర్గాలు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురయ్యాయి. తీవ్ర విమర్శలతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అమరావతి జేఏసీకి చెందిన దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి, కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (A1) చేర్చారు. ఇదే కేసులో ఇప్పటికే.. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏ-2గా చేర్చిన పోలీసులు ఆయన్ను కూడా అరెస్ట్ చేయడంతో, ఇప్పటికే కొమ్మినేని కూడా రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.


Next Story