Anam Ramanarayana Reddy: ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణ: ఆనం రామనారాయణ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డి

Anam Ramanarayana Reddy: విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంపై పత్రికా కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం, గతంలో సమర్పించిన నివేదికలు పూర్తిస్థాయిలో లేవని, అందుకే కొత్తగా విచారణ చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కనకదుర్గ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చాలా ఆలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు లేకపోవడం వల్ల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆన్‌లైన్ టికెట్లను పంచింగ్ చేయకుండా మోసం చేస్తున్నారని మంత్రి వివరించారు. త్వరలో పూర్తి డిజిటలైజేషన్ అమలు చేస్తే ఇలాంటి రిపీట్ టికెట్ల సమస్య తగ్గిపోతుందని తెలిపారు.
జగన్ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలు, అక్రమాలు, పరిపాలనా లోపాలపై సమగ్ర విచారణ చేపడతామని, గతంలో నివేదికలు ఇచ్చిన అధికారులపై కూడా పరిశీలన జరుగుతుందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తప్పు చేసిన వారెవరైనా కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దేవాదాయ భూముల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. జగన్ హయాంలో నిర్లక్ష్యం వల్ల ఆలయాల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. లక్షల ఎకరాల దేవాదాయ ఆస్తులను గుర్తించి, సుమారు 2 వేల భూమి వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు.
పెరుమాళ్లపాడు శివాలయం ఇసుక తుఫానులో మునిగిపోయినందున ప్రత్యామ్నాయ ఆలయం నిర్మాణానికి అనుమతి ఇచ్చామని, పెన్నానది ఒడ్డున స్థలం కేటాయించి 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.

