YSJAGAN TOUR : వైఎస్.జగన్ బంగారు పాళ్యం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి
మామిడి యార్డులో 500 మంది రైతులకు మాత్రమే అనుమతి – ఎస్పీ మణికంఠ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి యార్డ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. అనంతరపురం డీఐజీ షేముషి బాజపాయి, చిత్తూరు జిల్లా ఎస్పీ చందోలు వీఎన్ మణికంఠలు జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. గిట్టుబాటు ధర లభించక పండించిన మామిడి కాయలను రోడ్ల మీద పారబోసి నిరసనలు తెలుపుతున్న బంగారు పాళ్యం మామిడి యార్డు రైతులకు ధైర్యం చెప్పి వారితో ముఖాముఖీ భేటీ అవడానికి నేడు బుధవారం వైఎస్.జగన్ మామిడి మార్కెట్ యార్డ్ సందర్శనకు వెళ్లనున్నారు. అయితే జగన్ పర్యటనకు జిల్లా పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. జగన్ పర్యటన సందర్భంగా ఇతర జిల్లాల్లో తలెత్తిన శాంతిభద్రతల సమస్యలు చిత్తూరు జిల్లాలో పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అనంతపురం డీఐజీ షేమూషీ బాజపేయి తెలిపారు. మ్యాంగో యార్డులో వైఎస్.జగన్ తో ముఖాముఖీలో పాల్గొనడానికి 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఉందని డీఐజీ చెప్పారు. అలాగే హెలీపాడ్ వద్ద 30 మంది నాయకులను మాత్రమే అనుమతిస్తామన్నారు. యార్డు సమీపంలో పాఠశాలలు, పెట్రోలు బంకులు ఉన్నందున ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైఎస్.జగన్ పర్యటనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే అనుమతి వర్తిస్తుందని డీఐజీ చెప్పారు. అనుమతికి మించి జనసమీరణ చేస్తే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అందువల్ల నిర్వాహకులు అనుమతులకు లోబడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని డీఐజీ సూచించారు. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ షేముషీ హెచ్చారించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ చందోలు మణికంఠ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటన సందర్భంగా డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు 500 మందికి అనుమతి ఇచ్చినా నిర్వాహకులు 25000 వేల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే నిర్వాహకులపై కేసులు తప్పవన్నారు. మండలానికి వచ్చే ప్రతి వాహనంపై నిఘా ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ మణికంఠం కోరారు. అయితే వైఎస్.జగన్ పర్యటన సందర్భంగా ఇప్పటికే 377 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో 55 మందిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.
