Deputy CM Pawan Kalyan: ‘స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు’ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదిని కాలుష్యరహితంగా మార్చడం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఆరు జిల్లాల్లోని 262 పుష్కర పంచాయతీలను గుర్తించి, వాటిని మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మురుగు నీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి ప్లాంట్ల (STP) నిర్మాణం వేగవంతం చేయాలని, పీసీబీ మంజూరు చేసిన రూ.100 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.

రోజువారీ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిని కలుషితం చేస్తోందని, ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్లు, ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి 32 మిలియన్ లీటర్లు, ఆక్వా కాలుష్యం 13.24 మిలియన్ లీటర్లు కలుస్తున్నట్లు అధికారులు వివరించారు.

పారిశ్రామిక కాలుష్య నివారణకు నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ఆర్టీజీఎస్ తరహాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్‌కు కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

పుష్కరాల సమయంలో భక్తులు పవిత్రంగా స్నానం చేసే విధంగా గోదావరిని స్వచ్ఛంగా ఉంచడం లక్ష్యంగా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story