కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ కి మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తి

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగం అభివృద్ధికి మ‌రింత తోడ్పాటు, ప్రోత్సాహం అంద‌చేయాల‌ని కేంద్ర పంచాయితీ రాజ్,,మత్స్య, పశుసంవర్ధక ,పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు తో క‌ల‌సి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్య కారుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు తీరంలో 194 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరాన్ని కలిగి ఉంద‌ని, రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రముఖ ఆక్వా హబ్ ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. ఈ జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం, మరియు వ్యవస్థీకృత మత్స్యవృద్ధిని అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద ప‌లు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు అందజేశారు. సముద్ర జీవవైవిధ్యాన్ని పెంచేందుకు మరియు సంప్రదాయ మత్స్యకారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 కృత్రిమ రీఫ్‌లను 194 కి.మీ తీరరేఖ వెంబడి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని 20 తీర గ్రామాలను క్లైమేట్ రెసిలియంట్ మత్స్యకార గ్రామాల కింద ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న మత్స్య నిల్వ సామర్థ్యాన్ని 1000 నుండి 2000 హెక్టార్‌కు పెంచడంతో పాటు, అన్ని గ్రామ పంచాయతీ ట్యాంకుల్లో నిల్వకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.

గరివిడిలోని వెటర్నరీ కాలేజీని గుర్తించండి

విజయనగరం జిల్లా గరివిడిలో ఉన్న వెటర్నరీ సైన్స్ కాలేజీకి గుర్తింపు కల్పించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అభ్యర్థించారు. ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక అవసరాలను తీర్చేందుకు ఈ కళాశాలను స్థాపించార‌ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. అధ్యాపకుల కొరత కారణంగా ఈ కళాశాలను భారత వెటర్నరీ కౌన్సిల్ చట్టం, 1984 IVC Act లోని మొదటి షెడ్యూల్ లో చేర్చే విషయాన్ని ప్రతిపాదించలేదని వెల్లడించారు. ప్రస్తుత విద్యార్థులను SVVU పరిధిలోని ఇతర గుర్తింపు పొందిన కళాశాలలకు బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. ప్రస్తుతం 1వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం విద్యార్థులు గరివిడిలోనే చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాల‌ని కోరారు. ఇవి అమలైతే విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే కాకుండా, ప్రాంతీయ వెటర్నరీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయగలమని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

Updated On 9 July 2025 9:57 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story