Corporation Elections: రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని, ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై కూటమి పార్టీల మధ్య చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. జనసేన నాలుగు మేయర్ స్థానాలు కోరుతున్నట్లు తెలిసింది. ఆ పార్టీకి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ స్థానాలు కేటాయించే అంశంపై ప్రాథమికంగా అవగాహన కుదిరినట్లు సమాచారం. భాజపాకు తిరుపతి స్థానం కేటాయించే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

స్థానిక రాజకీయ సమీకరణాలు, ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థానాల సర్దుబాటు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల సర్దుబాటుపైనా చర్చలు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది.

గెలుపే ప్రాతిపదిక!

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంతకు మించిన ఫలితాలతో తమ ప్రజాదరణ ఏ మాత్రం చెక్కుచెదరలేదని సంకేతం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. పొత్తు ధర్మానికి, ఐక్యతకు ఎక్కడా విఘాతం కలగకుండా, గెలుపే ప్రాతిపదికగా స్థానాల సర్దుబాటు జరగాలన్న లక్ష్యంతో కూటమి పార్టీలు చర్చలు జరుపుతున్నాయి.

మూడు పార్టీల ముఖ్య నాయకులతో ఏర్పడిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ పార్టీకి ఎక్కడ అనుకూలమన్న దానిపై ప్రాథమిక జాబితాలు రూపొందించాయి. ఇటీవల సీఎం చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రాథమికంగా అవగాహన కుదిరినట్లు, సోమవారం భేటీలో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Next Story