• పవన్‌ కళ్యాణ్‌ సర్వే నివేదికల్లో వెల్లడి
  • దిద్దుబాటు చర్యలకు దిగుతున్న జనసేనాని

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పనితీరు, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే విషయంపై ఎవరికి వారు అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదే కోవలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా తన పార్టీకి చెందిన శాసనసభ్యుల పనితీరు ఎలా ఉందనే అంశపై సర్వే చేయించుకున్నారు. ఈ విధంగా డిప్యూటీ సీయం పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యేలపై చేయించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయట. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల ద్వారా స్పష్టమయిందంటున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్‌ సిండికేట్లు, అక్రమ మట్టి తవ్వకాలు, బెదిరింపు వసూళ్ళు ఇలా ఒకటనేంటి… ఎన్ని రకాల దారులున్నాయో అన్నింటినీ వినియోగించుకుని తీవ్రమైన అవినీతి వ్యవహారాల్లో సగానికిపైగా జనసేన శాసనసభ్యులు నిండా మునిగిపోయి ఉన్నారని పవన్‌ కళ్యాణ్‌ చేయించుకున్న సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. సర్వే నివేదికలు చూసి షాక్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన నుంచి గత శాసనసభ ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి తమ బలాన్ని మరింత పెంచుకుని 2029 ఎన్నికల్లో ఇప్పటికన్నా ఎక్కువ కీలకంగా ప్రభుత్వంలో ఉండాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తుంటే మరో పక్క పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. జనసేన శాసనసభ్యుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పై తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కల్యాణ్ నిర్వహించిన సర్వేలో తేలిందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదన్న రిపోర్టులు పవన్ కు చేరినట్లు తెలిసింది.

జనసేన నుంచి గెలుపొందిన శాసనసభ్యుల్లో చాలా మంది మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే. దీంతో ప్రజా సమస్యలను గుర్తించడంలో వాటిని పరిష్కరించడంలో అనుభవం లేకపోవడం కారణంగా ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు. దానికి తోడు నియోజకవర్గంలో ఏది జరిగినా తమకు తెలియకుండా జరగకూడదనే ధోరణి, బంధువులు, మిత్రులు, అనుచరుల మితిమీరిన జోక్యంతో చెడ్డపేరు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో చాలా మంది జనసేన శాసనసభ్యులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్ధితిని చూసి పవన్ కళ్యాణ్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ ఏరి కోరి నిజాయితీని ప్రధాన అంశంగా తీసుకుని గత ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ చెప్పుకొచ్చింది. తీరా ఇప్పుడు పరిస్ధితి చూస్తే ఆయా నియోజకవర్గాల్లో అంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు ఎవ్వరి మీద రాని అవినీతి ఆరోపణలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యేలను చుట్టుముడుతున్నాయి. ఇందులో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు స్వయంగా వారే అవినీతి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతుండటంతో ప్రజల్లో పలుచన అయిపోయారనే ప్రచారం పవన్‌ కళ్యాణ్‌ ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాగే ఉపేక్షిస్తే పార్టీ కూడా ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్‌ ఆందోళన చెందుతున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

దీంతో పాటు కూటమిలోని ఇతర పార్టీ నేతలు కూడా సహకరించకపోతుండటంతో పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైందన్న నివేదికలు అందాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కు భారీగా ఆస్తులున్నాయి. ఎన్నికలకు ముందే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా ప్రతి పనికీ పర్సంటేజీలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఆ నియోజకవర్గంలో తొలిసారి జనసేన జెండా ఎగరడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేపై ఏ చిన్న అవకాశమొచ్చినా టీడీపీ, బీజేపీ నేతలే ఆ ఎమ్మెల్యేపై తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతూ బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పవన్ ఒకింత ఆశ్చర్యపోయారట. ఇక నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ కూటమి పార్టీల నేతల మధ్య తలెత్తిన మనస్పర్థలు మరింత ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయట.

ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే పై కూడా ఆరోపణలు అధికంగా వచ్చాయి. తొలినాళ్లలో మంచి పేరు తెచ్చుకుని పవన్ దృష్టిలో పడిన ఆ ఎమ్మెల్యే చేతివాటం మామూలుగా లేదంటున్నారు. ప్రతి పనికీ పర్సంటేజీ దండుకుంటున్నారని తెలిసింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యువకుడయిన ఆయన తన అనుచరులతో బెదిరింపులకు దిగుతూ కాంట్రాక్టర్లను బెదిరించి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న సమాచారం సర్వేలో తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ దొరకడం కూడా కష్టమన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయన్న టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story