CM Chandrababu: గొడ్డలి పార్టీ కుట్రలు, అల్లర్ల నిరసనలను తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (గొడ్డలి పార్టీ) కుట్రలు, అల్లర్ల నిరసనలపై కఠినంగా హెచ్చరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు అందరికీ ఉందని స్పష్టం చేసిన సీఎం, ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్‌లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని వైసీపీ నేతలను హెచ్చరించారు. చట్టవ్యతిరేకంగా ఏం చేసినా కూడా సహించబోమని స్పష్టం చేశారు. “గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఉన్నారా?” అని ప్రశ్నించిన సీఎం, కర్నూలు నగరంలో ఈరోజు (శనివారం) ఆందోళన చేసిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల డీఎస్సీ ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.
టీడీపీ యూనిట్ ఇన్‌ఛార్జిల శిక్షణా తరగతుల్లో మాట్లాడిన సీఎం, కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకపోతే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందన్నారు. “చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి” అని నిర్దేశించారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగామని సీఎం వెల్లడించారు. డీఎస్సీలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగామన్నారు. కాబట్టే గొడ్డలి పార్టీ మినహా కొన్ని పార్టీల నేతలు కూడా ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమన్నారు. పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను చేధిస్తారనడానికి కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళనే ఉదాహరణ అని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాధారణ కార్యకర్తకైనా, పార్టీ అగ్రనాయకుడికైనా పార్టీనే సుప్రీం అని అన్నారు. కార్యకర్తలను పట్టించుకోని వారిని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే రావాలని సూచించారు. యూనిట్, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చేస్తామని పేర్కొన్నారు.
ఈ ఆగస్టు నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకూ ఈ నెలలోనే సాకారమవుతాయని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వచ్చే ఏడాది విశాఖ వరకూ తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతికి సంబంధించి ఈ నెలలోనే సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉందని, ఆ తర్వాత నాగార్జున సాగర్‌కూ నీరు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని, ఈ ప్రజెంటేషన్ కోసం 10 గంటలు అధ్యయనం చేశానని గుర్తు చేసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితిని వివరిస్తేనే ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు.

