Municipal Elections in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పీఠం కోసం బరిలో నిలబడిన 520 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల హోదా కోసం పోటీపడిన 10,105 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సుమారు 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు నేడు వెలువడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఈ లెక్కింపు నిర్వహిస్తున్నారు. దీనికి 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటున్నారు.

ఎన్నికలు జరిగిన 13 మేయర్‌ స్థానాలకు కూటమి నుంచి తెదేపా 10 చోట్ల, జనసేన 2 స్థానాల్లో, భాజపా ఒకచోట పోటీ చేశాయి. వైకాపా 13 చోట్లా పోటీకి దిగింది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్‌ స్థానాలకు గాను 17 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 ఛైర్‌పర్సన్‌ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు 49 చోట్ల, జనసేన నుంచి 17 స్థానాల్లో, భాజపా నుంచి 4 స్థానాల్లో బరిలో నిలిచారు. వైకాపా అభ్యర్థులు 70 చోట్లా పోటీ చేశారు.

కూటమి ప్రభుత్వం తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమాగా ఉంది. కొన్ని చోట్ల గట్టి పోటీని ఇస్తామని వైకాపా లెక్కలు వేస్తోంది. డివిజన్లు, వార్డుల్లో ఓట్ల ఆధారంగా బ్యాలట్‌ పత్రాలు కట్టలు కట్టేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Next Story