హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha: రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలపై నేరాలు 4.4 శాతం తగ్గినట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళలను అందరూ గౌరవించాలనే సంస్కృతి ఇళ్ల నుంచే ప్రారంభమవ్వాలని, సమాజ భద్రత మహిళల రక్షణపైనే ఆధారపడి ఉందని ఆమె ఉద్ఘాటించారు.

విజయవాడలో సోమవారం ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళల భద్రతా వారోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు అందిస్తున్న కృషి అద్భుతమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు సమస్యలను నేర్పుగా పరిష్కరించుకునే సామర్థ్యం కల్పించాలని, అదే వారికి ఇవ్వగలిగే అతిపెద్ద ఆస్తి అని సూచించారు.

పోక్సో, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులు జైలు నుంచి బయటకు వచ్చినా వారిపై నిఘా కొనసాగుతుందని మంత్రి హెచ్చరించారు. బాధితులను మళ్లీ బెదిరిస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, మహిళా సాధికారత, భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మహిళా, శిశు భద్రతా విభాగం లోగో, పోస్టర్‌ను హోంమంత్రి అనిత, ఛైర్‌పర్సన్ శైలజ, సీపీ రాజశేఖరబాబు తదితరులు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ కార్యక్రమంలో అవగాహన కల్పించిన మహిళా పోలీసులు కడలి రేవతి, హైమావతి, శైలజ, ఉషారాణిని మంత్రి అనిత సన్మానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story