Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ పనితీరును ప్రశంసించిన అనిత, మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు.

హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైంది. జీరో క్రైమ్ రేట్ సాధించడమే మా లక్ష్యం. మహిళా భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది” అని తెలిపారు.

అదే సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన అనిత, “రాజకీయ ముసుగు వేసుకొని మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్న వారికి సరైన సమయంలో సమాధానం చెబుతా. నా డిపార్ట్‌మెంట్ పనితీరును ప్రశంసించుకునే సమయంలో అనవసర వ్యక్తుల వ్యాఖ్యలపై చర్చకు తావివ్వను” అని అన్నారు.

“మేం ఒక్క మాట తప్పు మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని పిలిచి మందలిస్తారు. ఇతర పార్టీలు ఇలాంటి విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండకపోతున్నారో అర్థం కాదు. మహిళల్ని కించపరిచేవారు, అసభ్య పోస్టులు పెట్టేవారు తమకు తల్లి, చెల్లి ఉన్నారని గ్రహించాలి” అని హితవు పలికారు.

పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తున్న నేపథ్యంలో మహిళల భద్రత, నేరాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి అనిత ఈ సందర్భంగా పేక్షించారు.

Next Story