ఏపీ డీసీయం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై తమిళనాడు రాష్ట్రంలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. గత నెల 22వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో వక్తల ప్రసంగాలు మతపరమైన వైరాన్ని సృష్టించేవిగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలైల తోపాటు సదస్సు ముఖ్య నిర్వహకులపై ఈ3 అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మదురై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ సమన్వయకర్త, న్యాయవాది ఎస్.వంజినాథన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. జూన్ 22వ తేదీన జరిగిన మురుగన్ భక్తుల సదస్సు కార్యక్రమంలో వక్తలు చేసిన ప్రసంగాలు, తీర్మానాలు మతపరమైన వైరాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వంజినాథన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మతపరమైన, రాజకీయ పరమైన ప్రసంగాల్లో కఠినమైన పరిమితులు విధిస్తూ ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగాలు మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల కంటెంట్‌లో "మతం, జాతి మరియు ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే" మరియు ఇతర వర్గాల "మతపరమైన భావాలను రెచ్చగొట్టే" భాష ఉందని వంగినాథన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది వంగినాథన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, హిందూ మున్నాని అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రహ్మణ్యంల తోపాటు సదస్సు ముఖ్య నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(ఎ), 299, 302, మరియు 353(1)(బి)(2) కింద కేసు నమోదు చేశారు.
