RDS Barrage: ఆర్డీఎస్ ఆనకట్టపై సీడబ్ల్యూసీ సభ్యుడి ఆగ్రహం.. కర్ణాటక, ఏపీ అధికారులపై ప్రశ్నల వర్షం
కర్ణాటక, ఏపీ అధికారులపై ప్రశ్నల వర్షం

RDS Barrage: రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆనకట్ట ఎత్తుపెంపు, పటిష్ఠం చేసే పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు యోగేశ్ కర్ణాటక అధికారులను నిలదీశారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆనకట్టను పరిశీలించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవోల ప్రకారం చేపట్టాల్సిన ఆర్డీఎస్ ప్యాకేజీ-1, 2 పనులు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని యోగేశ్ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ఆనకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టకు కుడివైపు కాలువ నిర్మాణంపైనా వారిని నిలదీశారు.
కృష్ణా నదీ జల వివాదాల ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 అవార్డు ఇంకా అమలు కాలేదని, అయినా కుడికాలువ పనులు చేపట్టడం సీడబ్ల్యూసీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అనుమతులు వచ్చే వరకు పనులు ఆపాలని ఆదేశించారు. ఆనకట్ట రివర్ స్లూయిస్‌లోని ఐదు షట్టర్లలో ఒకదాన్ని పూర్తిగా తొలగించినట్లు గుర్తించిన ఆయన.. అన్ని షట్టర్లు 1,089 అడుగుల ఎత్తులో ఉండాలని నిర్దేశించారు.
ఆనకట్ట వద్ద 1,100 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచుకునే హక్కు ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలంగాణ అధికారులు సీడబ్ల్యూసీ సభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. ఫాలింగ్ షట్టర్లు బిగించకపోవడంతో తెలంగాణ నీటి హక్కులు కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌ను తుంగభద్ర డ్యాం బోర్డు పరిధిలోకి తేవాలని కోరారు.
ఈ పరిశీలనలో సీడబ్ల్యూసీ సీఈ రామకృష్ణారెడ్డి, ప్రతినిధులు శంకర్, సంజీవ, జూరాల ప్రాజెక్టు ఎస్‌ఈ కేశవరావు, ఏపీ డీఈలు రామకృష్ణ, జగదీష్, విజయ్‌కుమార్‌రెడ్డి, కర్ణాటక ఈఈ గోడేకర్ పాల్గొన్నారు.
- RDSBarrageRDSDamRDSProjectTungabhadraRiverCWCCentralWaterCommissionKarnatakaAndhraPradeshAPWaterIssuesKarnatakaWaterIssuesWaterDisputeWaterRightsRiverWaterIrrigationIrrigationProjectsWaterManagementDamNewsBarrageNewsKarnatakaAPAPKarnatakaWaterResourcesFarmersAgricultureAndhraPradeshNewsKarnatakaNewsLatestAPNewsLatestPoliticalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

