Cyclone Arnab Damage: ఆంధ్రప్రదేశ్‌పై ఆర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. నష్టం అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపాలని కోరారు.


తుఫాన్ సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్‌డీఆర్‌ఎఫ్, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను నియమించినట్లు సీఎం స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై 220కు పైగా చెట్లు కూలిపోయాయి. తీర ప్రాంతాల్లో అనేక చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని స్పష్టం చేశారు.


అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story