100 రైళ్లు, 36 ఫ్లైట్లు రద్దు!

Cyclone Montha: మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కోస్తా జిల్లాలపై తుఫాను భారీ ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంగళవారం 100కు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుల నుంచి 100 మేర విమాన సర్వీసులు కూడా బంద్ అయ్యాయి. ప్రజల రవాణాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది.

విజయవాడ డివిజనల్ రైల్వే పరిధిలో 95 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 43 రైళ్లకు బ్రేక్ పడింది. తిరుపతి-విశాఖపట్నం (22708), విజయవాడ-రాజమండ్రి (67262), హైదరాబాద్-విశాఖపట్నం (12728), రేపల్లె-మార్కాపూర్ రోడ్ (67238), విజయవాడ-ఒంగోలు (67273), కాకినాడ పోర్టు-విశాఖపట్నం (17267), విశాఖపట్నం-రాజమండ్రి (67286), మహబూబ్‌నగర్-విశాఖపట్నం (12862), చెన్నై సెంట్రల్-విశాఖపట్నం (22870), భువనేశ్వర్-బెంగళూరు (18463), సికింద్రాబాద్-విశాఖపట్నం (12740), భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), లింగంపల్లి-విశాఖపట్నం (12806), కడప-విశాఖ (18522), రాయగడ-గుంటూరు (17244) తదితర రైళ్లు రద్దయ్యాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు 24 గంటల్లోనే రీఫండ్ ఇవ్వేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం రాత్రి విజయవాడ-విశాఖ మార్గంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు బంద్ అయింది. ఇక్కడి నుంచి 46 సర్వీసులు నడుస్తుండగా, మంగళవారం 36 రద్దయ్యాయి. షార్జా మార్గంలో 2, విజయవాడ-విశాఖ మధ్య 2, విజయవాడ-బెంగళూరు 2, విజయవాడ-హైదరాబాద్ 2 సర్వీసులు బంద్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్గాల్లో 18 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. కేవలం ఉదయం 10.30 గంటల వరకు విమానాలకు అనుమతి ఇచ్చారు.

రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9.30 గంటల లోపు సర్వీసులు మాత్రమే యథావిధిగా నడుస్తాయి. తర్వాత ముంబై, తిరుపతి, బెంగళూరు, చెన్నై మార్గాల్లోని సర్వీసులు రద్దు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు వెళ్లే 56 ఇండిగో, ఎయిర్‌ఇండియా సర్వీసులు బంద్ అయ్యాయి.

కాగా, తుఫాను ముప్పు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ సోమవారం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story