Cyclone Murasu Wreaks Havoc: మురసు తుపాను దాడి.. వేల ఎకరాల పంటలు నీట మునిగి రైతులు ఆవేదన
రైతులు ఆవేదన

Cyclone Murasu Wreaks Havoc: పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో అర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో వీచిన బలమైన గాలులు, భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. వారం రోజులుగా నీటిలో ఉన్న పొలాలు సోమవారం నాటికి వరద తగ్గుముఖం పట్టడంతో బయటకు కనిపిస్తున్నాయి. పైరు నేలవాలిపోగా గింజలు మొలకలొచ్చాయి. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో నీటిలోనే నానుతున్న వరి పైరును రైతు రేల సత్యనారాయణ చూపుతూ నష్టాన్ని వివరించారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెం వద్ద కోత దశకు వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. అదే గ్రామంలో సాగుచేసిన దోస పంట వాననీటిలో నాని కుళ్లిపోయింది. రాపర్లలో మిరప పొలంలో నీళ్లు చేరి వేర్లు కుళ్లిపోవడంతో రైతులు మొత్తం పైరును తొలగించేస్తున్నారు.
ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల రైతులు పొగాకును త్రోవగుంట వద్దనున్న వేలం కేంద్రంలో విక్రయిస్తుంటారు. గాలివానకు గోదాము షెడ్డు రేకులు లేచిపోయి, గోడలు పడిపోయాయి. దీంతో ఆ నీరంతా లోపలికి వచ్చి పొగాకు బేళ్లు తడిసి పాడయ్యాయి.
ఎల్నినో కారణంగా నీటి ఇబ్బందులు ఎదురైనా ఎన్నో అవస్థలు పడి పంటలను కాపాడుకుంటే తీరా చేతికొచ్చాక తుపాను తుడిచి పెట్టేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

