Minister Nadendla: ‘మీ మార్ట్’ల ద్వారా తక్కువ ధరలకే నిత్యావసరాలు.. 29 వేల రేషన్ దుకాణాలు బలోపేతం: మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల

Minister Nadendla: రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. కన్నబాబు ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫోరం (ఎన్‌సీసీఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ అనిస్ జోసెఫ్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీ వ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా 1,000 ‘మీ మార్ట్’లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని రేషన్ దుకాణాల ద్వారా సుమారు 70 రకాల నిత్యావసర వస్తువులను విక్రయించనున్నారు. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరటమే కాకుండా రేషన్ డీలర్లకు ఉపాధి, అదనపు ఆదాయం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు, అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో రూ.40కు అందించడమే లక్ష్యమని, రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న రూ.281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ధాన్యం ట్రాకింగ్‌కు ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ అమలు చేస్తున్నామని, డిజిటల్ వాలెట్ విధానం ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, బియ్యం ధరలు కిలో రూ.52 వద్ద స్థిరీకరించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

