Deputy CM Pawan Kalyan: ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల భద్రతకు చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలపైనా వివరాలు అడిగారు. ఈ సమీక్షలో అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పులి కదలికలపై అటవీ శాఖ, ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Next Story