Deputy CM Pawan Kalyan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ముంబయిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు అందించడం వంటి కీలక అంశాలపై నేతలు చర్చించారు. భవిష్యత్తులో ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్రాలు మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. పులుల సంఖ్యను పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని పేక్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తూర్పు కనుమలలో పులుల సంరక్షణ ఇతిహాసంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భేటీ ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.

Next Story