సీఎం చంద్రబాబు దంపతుల దుర్గమ్మ సేవ!

AP CM Chandrababu: దసరా ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఒక్క రోజులోనే 2 లక్షల మందికి పైగా భక్తులు జగన్మాత దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఆలయానికి చేరుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.

అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకే 50 వేల మంది దర్శనాలు పూర్తి చేసుకోగా, మధ్యాహ్నం 1.30 గంటలకు లక్ష దాటిపోయింది. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి రెండు వైపులా క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే భర్తీ అయ్యాయి. హోల్డింగ్ ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల తర్వాత భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. అప్పటి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు క్యూలైన్లు రద్దీగా సాగాయి.

దసరా ఉత్సవాల ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల మందికిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి సరస్వతీ దేవిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఏర్పాట్లు బాగున్నాయని సీఎం అధికారులను కొనియాడారు. సాంకేతికతను విరివిగా వినియోగించినందుకు మెచ్చుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story