సినిమాల్లో డైలాగులు నిజ జీవితంలో వల్లెవేస్తారా? - పవన్ కల్యాణ్ ఫైర్
Do you practice dialogues in movies in real life? - Pawan Kalyan Fire

సినిమాల్లో పలికే డైలాగులు తెరపైనే బాగుంటాయని, వాటిని నిజ జీవితంలో అనుసరించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపడమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. హింసను, రెచ్చగొట్టే భాషను ప్రోత్సహించడానికీ, చట్టాన్ని తిరస్కరించడానికీ మన వ్యవస్థలో స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా ప్రవర్తించాలని, సమాజంలో భయాందోళనలు కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడమే ప్రభుత్వ విధానమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా మాట్లాడే వారిని ప్రజలు గమనించాలన్నారు. అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించడమూ నేరమేనని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీడియా ఎదుట స్పందించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థించేలా మాట్లాడే వారు సున్నితమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం తక్కువ నేరం కాదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. ఇప్పటికే పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అవసరమైతే రౌడీ షీట్లు తెరిచి, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని గట్టిగా అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడదని, అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలిచే వారికి కూడా ఉపేక్ష ఉండదని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.
