Minister Nara Lokesh: చిన్నచిన్న సమస్యలకు కుంగిపోవద్దు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో పరీక్ష పెట్టడమే కాదు, ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. ఆ దిశగా పోరాడాలి. ఫెయిల్‌ అంటే నా దృష్టిలో ‘ఫస్ట్‌ అటెంప్ట్‌ ఇన్‌ లెర్నింగ్‌’ అని అర్థం – అని మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా పిలుపునిచ్చారు.

కాకినాడలోని తిమ్మాపురంలో ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘భారతీయం’ పేరుతో ఆదివారం నిర్వహించిన దేశభక్తి కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు లెక్కచేయని త్యాగధనులెందరో ఉన్నారు. నేటి తరం వారిని స్మరించుకుంటూ ఆ బాటలోనే నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విలువలతో కూడిన సమాజం, కుటుంబ వ్యవస్థే మన బలమని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధించగలమని, దీనికి నైతిక విలువలు తోడైతే ఏపీ మోడల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌గా మారుతుందని పేర్కొన్నారు.

సినిమాల్లో పోరాట దృశ్యాలు, నృత్యాలు చూసి హీరోలు అంటాం. కానీ నిజమైన హీరోలు మన సైనికులే అని లోకేశ్‌ స్పష్టం చేశారు. కార్గిల్‌ యుద్ధవీరుడు కిరణ్‌కుమార్‌ సరిహద్దులో శత్రువులతో పోరాడారు. శరీరంలో బుల్లెట్లు దిగాయి, కంటిచూపు పోయింది. అయినా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆయన శరీరంలో బుల్లెట్‌ ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌లో జవాను మురళీనాయక్‌ చనిపోయారు. సైన్యంలో చేరడానికి తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. యుద్ధంలో తాను చనిపోతే దేశం మొత్తం మీకోసం నిలబడుతుందని ఆయన చెప్పారని, శ్రీసత్యసాయి జిల్లాలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తెలిసిందని లోకేశ్‌ పేర్కొన్నారు. ఇలాంటి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయొద్దన్న చాగంటి మాట వినడానికి సులభంగా ఉన్నా బలమైన సందేశం అందిస్తుందని అన్నారు.

పిల్లల్లో ఆలోచనా శక్తి పెరిగేలా చేయడమే నైతిక విలువల లక్ష్యం. ఏది మంచి, ఏది చెడో తెలిసేలా చేయాలి. ఆరేళ్లలోపే 90 శాతం మెదడు వృద్ధి చెందుతుంది. ఆ దశలోనే చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు నేర్పించాలి. అప్పుడే ప్రపంచ విజేతలవుతామని లోకేశ్‌ అన్నారు.

ఇదే కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామం గత చరిత్ర కాదని, మన వర్తమానానికి పునాది అని, అది భారతీయుల వారసత్వ సంపదని అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను పిల్లలకు బహుమతులుగా ఇచ్చి చదివించాలని, స్వాతంత్య్ర సమరయోధుల ఊళ్లు, జైళ్లు, స్మారకాలు, పోరాట ప్రదేశాలను పిల్లలకు ఒక్కసారైనా చూపించాలని సూచించారు. సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు ‘భారతీయులు లేని సైమన్‌ మాకు వద్దు’ అని నిరసనలు తెలిపినప్పుడే ‘భారతీయం’ పదం పుట్టిందని వివరించారు.

స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు సందేశాలు ఇచ్చారు. అంధ విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్జేడీ నాగమణి, డీఈవో రమేశ్‌ పాల్గొన్నారు.

Next Story