CM Chandrababu: ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావద్దు.. మహిళలు ప్రచారం చేయాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సు ప్రయాణం చేసి, మహిళలతో కలిసి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్త్రీశక్తి లబ్ధిదారులకు తేనీటి విందు ఏర్పాటు చేసి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి సంభాషణ నిర్వహించారు.
మహిళల కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్న సీఎం, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సంపాదించే వారిని నమ్మవద్దని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని మహిళలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే పదేళ్లలో లక్ష్యాల గురించి అడిగిన సీఎంకు మహిళలు సమాధానాలు ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన ఒక ముస్లిం మహిళ డ్వాక్రా సంఘం నుంచి కోటి రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. విశాఖకు చెందిన ఉద్యోగిని ఏఐ రంగంలో నైపుణ్యం సాధించి సాఫ్ట్‌వేర్ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని తెలిపింది. స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు మూడు వేల రూపాయలు ఆదా అవుతున్నామని, ప్రభుత్వ పథకాలతో మహిళలే ఎక్కువగా సంపాదిస్తూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నామని పలువురు మహిళలు చెప్పారు. అమరావతి నిర్మాణాలు చూడాలని కోరిన మహిళల కోసం రాజధానిలో పర్యటన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటితో ఏడాది పూర్తైందని, ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయని సీఎం చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు డబ్బులు ఆదా చేసుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో అందరి ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలని, అదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వందనం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజారోగ్యం కోసం సంజీవని వంటి పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలపై ఒకప్పటి చిన్నచూపు మారి ఇప్పుడు మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించి, వాటి ద్వారా 25 వేల కోట్ల రూపాయల పొదుపు బ్యాంకుల్లో ఉందని, మహిళలు రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారని గర్వంగా చెప్పారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం నియంత్రించామని, గంజాయి, బ్లేడ్ బ్యాచులను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలనలో మహిళలు చొరవ తీసుకోవాలని, రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారిని గమనించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని, డ్వాక్రా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని మహిళలకు సీఎం సూచించారు.
- ChandrababuNaiduCMChandrababuElectionInducementsElectionLuresVoteBuyingElectionAwarenessVoterAwarenessWomenVotersWomenEmpowermentWomenCampaignElectionCampaignFreebiesInElectionsElectoralReformsCleanElectionsDemocracyAndhraPradeshAPPoliticsAndhraPradeshPoliticsTDPTeluguDesamPoliticalNewsElectionNewsVoterRightsResponsibleVotingLatestAPNewsLatestPoliticalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

