Minister Lokesh: డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మొద్దు.. విశాఖ తాగునీటికి భంగం లేదు: మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్

Minister Lokesh: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లకు అవసరమైన నీటిని ప్రజల తాగునీటి నుంచి తీసుకోబోమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖకు తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లకు కావాల్సిన 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని వివరించారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి లోకేశ్ డేటా సెంటర్లపై కొందరు కావాలనే దుష్ప్రచారం, దొంగ వీడియోలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా పర్యావరణ ఉల్లంఘనలు జరగడం లేదని, మారుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్లు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
1995లో ఐటీకి ప్రోత్సాహమిచ్చిన చంద్రబాబు కాలంలో ఉద్యోగి చనిపోతే రేడియేషన్ వల్లనేనని ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గకపోవడంతోనే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని గుర్తు చేశారు. గూగుల్ విశాఖకు వస్తున్నట్లు ప్రకటించాకే పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం 6.5 గిగావాట్లకు మించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించగా ఇప్పటికే ఆ లక్ష్యం చేరామన్నారు.
డేటా సెంటర్లు 70 శాతం గ్రీన్ విద్యుత్తే వాడాలని నిబంధన విధించామని, సౌర, పవన, పంప్డ్ స్టోరేజి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును వినియోగిస్తారని తెలిపారు. ఒక సంస్థ 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, ఇంటెల్ డేటా సెంటర్‌లో ఎయిర్‌కూల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని వివరించారు. కొత్త సాంకేతికతలతో నీటి, విద్యుత్తు వినియోగం తగ్గుతోందన్నారు.
డేటా సెంటర్ల చుట్టూ ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందని, క్యారియర్, ఎల్‌జీ వంటి సంస్థలు కూలింగ్ వ్యవస్థ కోసం పెట్టుబడులు పెడుతున్నాయని, దీనితో 20 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, వేర్‌హౌసింగ్, రవాణా, ఆతిథ్య, రిటెయిల్, సేవా రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదని, నీటి భద్రత, విద్యుత్తు వినియోగం, ఉపాధి కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.

