తెలంగాణకు చంద్రబాబు విజ్ఞప్తి

Chandrababu Appeals to Telangana: గోదావరి నదిలో సమృద్ధిగా నీరు ఉండగా.. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

‘‘సముద్రంలోకి కలిసే నీటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నాను. రాజకీయ నాయకులు పోటీపడి మాట్లాడటం సరికాదు. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం ఉండాలి. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగి ఇతరులు ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలాడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేయడం మాత్రమే శ్రేయస్కరం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గతంలో తాను తెలంగాణకు చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ.. ‘‘ఆర్టీఎస్‌లో నీళ్లు రాకపోతే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను నేనే ప్రారంభించాను. దేవాదులను మరింత అభివృద్ధి చేయండి.. మేం ఎప్పుడూ అడ్డుకోలేదు’’ అని పేర్కొన్నారు.

గోదావరి నదిలో పుష్కల నీరు ఉందని, దేవాదుల నుంచి వచ్చే నీటికి అభ్యంతరం చెప్పడంలో అర్థం లేదని వివరించారు. ‘‘నీళ్లు పొదుపుగా వాడితే తెలంగాణకే లాభం. మిగిలిన నీటిని సాగర్, శ్రీశైలంలో నిల్వ చేసుకోవచ్చు. కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉంటే పైన ప్రాజెక్టులు కట్టడం నష్టం. కానీ గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేస్తే ఇబ్బంది ఉండదు’’ అని చెప్పారు.

వైకాపా వల్లే పోలవరం జాప్యం..

గత వైకాపా ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఆరేడేళ్లు ఆలస్యమైందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పిన తర్వాతే డయాఫ్రం వాల్ పాడైందని వారికి తెలిసింది. భవిష్యత్ విపత్తులను దృష్టిలో ఉంచుకుని కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. ఫిబ్రవరి 15లోపు పూర్తి చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టి ఎన్జీటీకి రూ.100 కోట్ల జరిమానా చెల్లించారని విమర్శించారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని, వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story