ED Clarifies: స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు ఎలాంటి పాత్రా లేదు: ఈడీ స్పష్టీకరణ
ఈడీ స్పష్టీకరణ

ED Clarifies: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) 2014-2019 కాలంలో సీమెన్స్ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగ ఆరోపణల కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధమూ లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నిర్వహించిన విచారణలో ఆయన పాత్రకు సంబంధించి ఏ ఆధారాలూ దొరకలేదని, నేరాదాయ (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) ప్రక్రియల్లో ఆయన పాలుపంచుకోలేదని ఈడీ నిర్ధారించింది. దీంతో ఆయన్ను నిందితుడిగా చేర్చకుండా, ప్రధాన అభియోగపత్రం మరియు తాజా అనుబంధ అభియోగపత్రంలో ఈ వివరాలను పేర్కొంది.
2021 డిసెంబరులో సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ 2022లో దర్యాప్తు చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఐడీ చంద్రబాబును ప్రధాన నిందితుడిగా (ఏ-1) చేర్చి, 2023 సెప్టెంబరులో అరెస్టు చేసి, 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో ఉంచింది. తర్వాత 2024 ఏప్రిల్‌లో విజయవాడ ఏసీబీ కోర్టులో అభియోగపత్రం సమర్పించి, ఆయన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ విషయాలను ఈడీకి పంపినప్పటికీ, తమ విచారణలో చంద్రబాబు పాత్ర ఎక్కడా కనిపించలేదని ఈడీ తన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో వివరించింది. ఇది వైసీపీ మరియు దాని అనుబంధ గ్రూపులు చేసిన దుష్ప్రచారాన్ని బట్టబయలు చేసింది.
సీమెన్స్ ప్రాజెక్టు అమలు సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను వివిధ సంస్థల ప్రతినిధులు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించారని ఈడీ దర్యాప్తులో తేలింది. నకిలీ ఇన్‌వాయిస్‌లు, బహుళ అంచెల లావాదేవీలతో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించి, సంబంధిత వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇందుకు సంబంధించి రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. అయితే, ఈ అంతర్గత వ్యవహారాల్లో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయమూ లేదని ఈడీ స్పష్టం చేసింది.
ఇప్పటికే సీఐడీ కేసులో కూడా చంద్రబాబుకు క్లీన్‌చిట్ లభించింది. ఆయనపై మోపిన ఆరోపణలను 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్'గా పేర్కొంటూ సీఐడీ తుది నివేదిక సమర్పించగా, న్యాయస్థానం అంగీకరించింది. ఈడీ తాజా వెల్లడులతో ఈ కేసు మొత్తం చంద్రబాబు విషయంలో రాజకీయ కుట్రలా కనిపిస్తోంది.

