ED Grills YSRCP MP Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం: రూ.100 కోట్లు ఎందుకు సమకూర్చారు?
రూ.100 కోట్లు ఎందుకు సమకూర్చారు?

ED Grills YSRCP MP Mithun Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణం కేసులో వైకాపా రాజ్యసభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో మద్యం విధానం రూపకల్పనలో ఆయన పాత్ర, భారీ నిధుల మళ్లింపు, ఇతర వ్యాపార సంస్థల లావాదేవీలపై అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా, నిందితుడు రాజ్ కెసిరెడ్డికి రూ.100 కోట్లు సమకూర్చడానికి విజయసాయిరెడ్డిని ఎందుకు కోరాల్సి వచ్చిందని ప్రశ్నించగా, మిథున్‌రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
వైకాపా పాలనా కాలంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. మద్యం డిస్టిలరీలను తమ అదుపులోకి తీసుకుని, సొంత బ్రాండ్లు తయారు చేయించి, బ్రూవరీల ద్వారా అమ్మకాలు చేసి భారీ లాభాలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లాభాలను ఇతర సంస్థలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మిథున్‌రెడ్డి పాత్ర ఉందని భావిస్తున్న అధికారులు, పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్, హుడ్‌వింక్స్ వంటి కంపెనీల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, నిధుల బదిలీలపై ఆధారాలతో ప్రశ్నలు వేశారు.
అదాన్ డిస్టిలరీస్, పీఎల్‌ఆర్ ఇండస్ట్రీస్ మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గమనించింది. ఇవి సాధారణ వ్యాపార లావాదేవీలేనని మిథున్‌రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే, రాజ్ కెసిరెడ్డికి రూ.100 కోట్లు ఎందుకు ఇచ్చారు? మద్యం వ్యాపార పెట్టుబడికి ఉపయోగించారా? అప్పు ఎలా తిరిగి చెల్లించారు? వంటి ప్రశ్నలకు ఆయన సూటిగా జవాబులు ఇవ్వకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన మిథున్‌రెడ్డి, సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోయారు. మధ్యలో భోజన విరామం మినహా నిరంతర విచారణ జరిగింది. ఆయన వెంట పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, శర్వాణి ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా ఉన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి విచారణలో వెల్లడైన అంశాలను కూడా మిథున్‌రెడ్డి ఎదుట ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు ఫలితాలను కూడా ఈడీ పరిగణనలోకి తీసుకుంది.

