Liquor Scam: మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం పెంచిన ఈడీ
దర్యాప్తు వేగం పెంచిన ఈడీ

Liquor Scam: వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీలోని 20 చోట్ల గురువారం మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు జరిగాయి. కీలక రికార్డులు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యజమాని తీగల విజేందర్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రితో సహా పలు చోట్ల సోదాలు జరిగాయి.
జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసేందుకు వైకాపా ముఠా అనేక మార్గాలు అనుసరించింది. ఏపీఎస్‌బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే 12 శాతం నగదు రూపంలోకి మార్చి వైకాపా ముఠాకు అందజేసేవారు. దీని కోసం బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లోకి నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్ మనీగా మార్చారు. ఈ ముడుపుల సొమ్మును వైకాపా ముఠా వివిధ మార్గాల్లో దిల్లీకి చేరవేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ సోదాలు జరిగిన చోట్లు: హైదరాబాద్‌లో అరేట్ ఆసుపత్రి, ఎస్‌జీఆర్ కన్స్ట్రక్షన్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని నివాసాలు; విజయవాడలో ఎస్‌బీఆర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జిల్లాలో రాజ్ కెసిరెడ్డి నివాసం; చెన్నైలో ఎన్‌జీఎస్ టెక్నాలజీస్, బెంగళూరులో ఎన్‌జీఎస్ ఇన్‌ఫ్రా, దిల్లీలో ఆర్‌కే ఫార్మా సహా పలు సంస్థలు.
సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నిందితుల వాంగ్మూలాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాల ఆధారంగా మనీలాండరింగ్ కోసం పలు కంపెనీలను వినియోగించినట్లు ఈడీ గుర్తించింది. డిస్టిలరీల యజమానులను ప్రశ్నించి వివరాలు సేకరించింది.
