CM Chandrababu Naidu: మురసు తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోండి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: మురసు తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. ‘‘అర్నబ్ తుపానుతో పోల్చితే మురసు ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. సోమవారం అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు మురసు తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చు’’ అని పేర్కొన్నారు.
వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్లు నింపాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది మొత్తం తుపాను తీరం దాటేవరకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం చెన్నై నుంచి మరో వెయ్యి మంది సిబ్బంది రానున్నట్లు తెలిపారు. అర్నబ్ తుపాను కారణంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి పంపినట్లు వివరించారు.
సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

