El Niño Challenge: ఎల్‌నినో సవాలు.. నీటి పొదుపు, అధికారుల సమన్వయం తప్పనిసరి: మంత్రి నిమ్మల రామానాయుడు
మంత్రి నిమ్మల రామానాయుడు

El Niño Challenge: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీసీ, ఎస్ఈలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టాలో ఖరీఫ్ అవసరాలకు వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలు, ఆరుతడి పంటలకే పరిమితం చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో సుమారు 55 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉందని వివరించారు.
గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగు కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి చెప్పారు. డెల్టాలో మెరక ప్రాంత రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని సూచించారు. ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కలుపు తొలగించాలన్నారు. ఖరీఫ్ సాగు పూర్తయ్యే వరకు ఓఅండ్‌ఎం పనులు కొనసాగించి, రైతులు, సాగునీటి సంఘాల సహకారంతో ఆయకట్టుకు నీరు అందించాలని ఆదేశించారు.
పోలవరం కుడి ప్రధాన కాలువ నీరు దుర్వినియోగం కాకుండా కృష్ణా డెల్టాకు అందేలా చూడాలన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్‌లు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎల్‌నినో క్లిష్ట సమయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా సెలవులు రద్దు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. కృష్ణా డెల్టా పరిధిలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండకుండా వరిసాగు చేస్తే భవిష్యత్తులో పంట నష్టపోతుందని హెచ్చరించారు. పట్టిసీమ నుంచి వచ్చే నీటిని తాగునీరు, ఆరుతడి పంటలకే పరిమితం చేయాలన్నారు. ఈ సీజన్‌లో నాగార్జునసాగర్‌కు నీళ్లు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీటిని తాగునీటికే భద్రపరచాలని ఆదేశించారు.

