Election Violence in Kuppam: చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ మూకలు రెచ్చిపోతూ ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతూ వీరంగం సృష్టించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

కుప్పం మండలం నడుమూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ మూకల దాడిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఫ్యాన్ పార్టీ మూకలు ప్రయత్నించాయి. శాంతిపురం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కడపల్లి గ్రామంలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. రోడ్డుపైకి గుంపులుగా వచ్చిన వారి కారణంగా రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ క్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి పోలీసులపైకి దూసుకువచ్చాడు. అయినా పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి అక్కడి నుంచి దూరంగా పంపించారు. ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story