Minister Nara Lokesh: ఎంతటి సీనియర్‌ నేతలైనా పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. పార్టీ కంటే ఎవరూ గొప్ప కాదని, ఏ అంశంపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి పనిచేయాలని ఆయన తెలిపారు. పనితీరు ఆధారంగానే పార్టీలో నాయకులకు గుర్తింపు ఉంటుందని, సిఫారసులు, పైరవీలతో కాదని పేర్కొన్నారు.

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ట్రైనింగ్‌ రిసోర్స్‌ పర్సన్స్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌ నిర్వహించి, ఎక్కువసార్లు తరగతులు చెప్పిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్‌, “అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదు. తొలిదశలో అవకాశాలు రానివారికి మలివిడతలో అవకాశం కల్పిస్తాం. కేంద్రంలో భాజపా వరుసగా మూడుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ కేడర్‌ కమిట్‌మెంటే కారణం. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి” అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,300 మంది క్లస్టర్‌, బూత్‌ ఇన్‌ఛార్జులకు శిక్షణ పూర్తయిందని, మరో 50 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్ని వేగంగా, సులభంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, వైకాపా దుష్ప్రచారాల్ని దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఐటీడీపీ విభాగం సమీక్షలో కమిటీ నియామకాల్ని త్వరగా పూర్తి చేయాలని, సభ్యులందర్నీ ‘మై టీడీపీ యాప్‌’తో అనుసంధానించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ చింతకాయల విజయ్‌ పాల్గొన్నారు.

అదే రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు బంజారా తండాల్లోని గుడులకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేయాలని, పూజారులకు నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్‌ ఛానల్‌ కల్పించాలని, గోపాలమిత్రలకు ఉద్యోగభద్రత, గౌరవ వేతనం పెంచాలని, అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు. చిత్తూరు జిల్లా చీకటిపల్లె గ్రామస్థులు మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన లోకేశ్‌, కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతానికిపైగా స్థానాల్ని బీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే అభ్యర్థిని ప్రకటించిన ఘనత వైకాపాకే దక్కిందని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రల్ని అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఖాళీ అయిన నామినేటెడ్‌ పదవుల భర్తీని స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక సమీక్షిస్తామని, బాగా పనిచేసినవారికే పదవులు రెన్యువల్‌ అవుతాయని చెప్పారు.

Next Story