Ministerial Sub-committee: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులను ఇప్పటి నుంచే ప్రారంభించాలని, శాఖలవారీగా వివరణాత్మక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు సూచించారు. ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించినట్లు వెల్లడయింది.

గోదావరి పుష్కరాల వ్యవహారాలపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.

టెంట్‌ సిటీలు, వసతి ఏర్పాట్లు

రాజమహేంద్రవరం సమీపంలోని బ్రిడ్జిలంక, పిచ్చుకలంక ప్రాంతాల్లో టెంట్‌ సిటీలు ఏర్పాటు చేయాలి.

సాధారణ ధరలకే టెంట్‌ సిటీలు, హోమ్‌ స్టేల్లో భక్తులకు వసతి కల్పించాలి.

పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ప్రస్తుతం 4,800 గదులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వసతి సౌకర్యాల కోసం ఖాళీ ప్రదేశాలు, మైదానాలు, ఫంక్షన్‌ హాళ్లను గుర్తించి పరిశీలించాలి.

ఘాట్లు, ఇతర ఏర్పాట్లు

గతంలో 234 ఘాట్లు ఉండగా, ఈసారి 373 ఘాట్లకు పెంచాలి. వీటిలో 70 పిండప్రదాన ఘాట్లు ఏర్పాటు చేయాలి.

సుమారు 10 కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా. ముఖ్యంగా తొలిరోజు, వారాంతాలు, అమావాస్య రోజుల్లో సగటున కోటి మంది చొప్పున తరలివచ్చే అవకాశం ఉంది.

ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒకే పుణ్యఫలితం వస్తుందని ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీనికి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో సమన్వయం చేసుకోవాలి.

రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలి. ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేపట్టాలి.

కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం

పుష్కరాలకు ఏడాది ముందుగా ఈ జూన్‌లోనే రాజమహేంద్రవరంలో భారీ కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలి.

ఇతర పనులు

3వేల కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ, విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి.

కొత్త ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులు నాణ్యతగా పూర్తి చేయాలి.

ఆరు జిల్లాల సంయుక్త కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించి, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి.

గోదావరి సమీపంలోని 391 ఆలయాల్లో మరమ్మతులు, 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలి.

ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆరు జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. పుష్కరాలు విజయవంతం కావాలంటే ఇప్పుడే సమగ్ర ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఒక్కటైన అభిప్రాయం వ్యక్తం చేసింది.

Next Story