Andhra Pradesh CM Nara Chandrababu Naidu : వైకాపా నేతలు బుకాయించినా వాస్తవాలు మారిపోవు- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Andhra Pradesh CM Nara Chandrababu Naidu : తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు బుకాయించినా వాస్తవాలు మారిపోవు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోమని, దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
ప్రజల దృష్టి మరల్చేందుకు వైకాపా దుష్ప్రచారం
తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బూతులు తిట్టినా మేం భరించాలా? అని ప్రశ్నించారు. దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంలో సీబీఐ మాకు నివేదిక పంపిందని, ఏక సభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తామని, అవసరమైతే కోర్టులో అదనపు సమాచారం చేరుస్తామని చెప్పారు.
ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని అసెంబ్లీలో మాట్లాడారని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే స్పష్టంగా చెప్పామని గుర్తుచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారని విమర్శించారు.
నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు?
నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వచ్చినా అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారని, కల్తీ జరుగుతోందని నివేదికలో స్పష్టంగా ఉండగా యథేచ్ఛగా కొనసాగించారని ఆరోపించారు.
తాను సీఎం కాగానే ప్రక్షాళన మొదలుపెట్టానని, పొరపాటు జరుగుతోందని శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని తెలిపారు. ఎన్‌డీడీబీ నివేదికలోని అంశాన్నే ప్రస్తావించానని, వైకాపా నేతలకు దేవుడంటే లెక్కలేనితనమా? విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా? అని ప్రశ్నించారు.
దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమని, చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదని, దేవుడికి అపచారం జరిగినప్పుడు ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు భగవంతుడే ప్రజలను సమాయత్తం చేస్తారని, మీరు చేసిన పని దుర్మార్గమైన అపచారమని ఆయన ఖండించారు.

