Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని, త్వరలో కీలక వార్త రాబోతుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వ్యాపిస్తున్న అబద్ధపు ప్రచారంపై జనసేన పార్టీ, డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్రంగా స్పందించాయి. ఈ విష ప్రచారాన్ని ఖండిస్తూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

వైసీపీ నేతలే వెనకుండి ఈ తప్పుడు ప్రచారాన్ని నడుపుతున్నారని జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారం చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ వాట్సాప్ ఛానల్‌పై డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారిక హెచ్చరిక జారీ చేసింది. ఇది ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ఛానల్ కాదని స్పష్టం చేసింది. కార్యాలయం పేరు, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ఆమోదయోగ్యం కాదని, ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ఈ నకిలీ ఛానల్‌ను విశ్వసించకూడదని, అనుసరించకూడదని, సమాచారాన్ని పంపించకూడదని సూచించింది. అధికారిక సమాచారం కోసం ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో రాజీనామా వార్తను షేర్ చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ క్షమాపణ చెప్పారు. ‘ఈరోజు ఉదయం గ్రూప్‌లో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టాను. సోషల్ మీడియాలో చూసి నిజానిజాలు నిర్ధారించుకోకుండా తొందరపాటుతో షేర్ చేశాను. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది. డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అధికారిక స్పందన వచ్చింది. ఇది పొరపాటున, ఎలాంటి దురుద్దేశం లేకుండా జరిగింది. హృదయపూర్వకంగా చింతిస్తున్నాను. పవన్ కల్యాణ్, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రూప్ సభ్యులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇకపై ఎటువంటి వార్తనైనా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే పోస్ట్ చేస్తాను’ అని అడ్మిన్ వివరణ ఇచ్చారు.

Next Story